Dhurandhar 2 Box Office Collection : ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 501.04 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. శనివారం (మూడో రోజు) వసూళ్లు భారీగా పుంజుకోవడంతో ఈ స్పీడ్ చూస్తుంటే వెయ్యి కోట్ల మార్కును అతి త్వరలోనే చేరుకునేలా కనిపిస్తోంది.
భారత్‌లో భారీ వసూళ్లు
శాక్‌నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, భారత్‌లో ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది. మొదటి రోజు రూ. 102.55 కోట్లు, రెండో రోజు రూ. 80.72 కోట్లు సాధించగా, మూడో రోజు శనివారం ఏకంగా రూ. 113 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో మూడు రోజుల మొత్తం దేశీయ నెట్ వసూళ్లు రూ. 296.27 కోట్లకు చేరుకున్నాయి. వీకెండ్ కావడంతో ఆదివారం కూడా రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఓవర్సీస్‌లో ‘ధురంధర్’ హవా
దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో సుమారు రూ. 96.50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఒక్క నార్త్ అమెరికాలోనే 4,405 షోలలో ప్రదర్శితమవుతోంది. అక్కడ కేవలం అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 23.70 కోట్లు రాబట్టింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి భారీ చిత్రాల రికార్డులను కూడా ‘ధురంధర్ 2’ అధిగమించేలా కనిపిస్తోంది.

