US Iran Peace Talks 2026 : అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కీలకమైన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల వైఫల్యానికి అమెరికా చేసిన “అర్థం లేని డిమాండ్లే” కారణమని ఇరాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రణరంగంలో ఆయుధాలతో సాధించలేని అంశాలను చర్చల టేబుల్ మీద సాధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపించింది.
21 గంటల సుదీర్ఘ చర్చలు.. ఫలితం శూన్యం
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందానికి, ఇరాన్ ప్రతినిధులకు మధ్య దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా సాగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ పట్టు వీడలేదు. తమ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తాము అన్ని రకాలుగా చొరవ చూపినప్పటికీ, అమెరికా మొండి వైఖరి వల్ల ఒప్పందం కుదరలేదని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
అమెరికా డిమాండ్లు ఇవేనా?
చర్చల వైఫల్యానికి గల కారణాలను వివరిస్తూ.. అమెరికా అహేతుకమైన షరతులను ముందుంచిందని ఇరాన్ పేర్కొంది. ముఖ్యంగా:
అణు కార్యక్రమం : ఇరాన్ తన అణు ఆశయాలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది.
హర్మూజ్ జలసంధి : వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని కోరింది.
యుద్ధ లక్ష్యాలు : క్షేత్రస్థాయిలో యుద్ధం ద్వారా సాధించలేని అనేక అంశాలను చర్చల ద్వారా ఇరాన్ అంగీకరించేలా ఒత్తిడి తెచ్చింది.
హర్మూజ్ జలసంధి మూసే ఉంటుంది : ఇరాన్ స్పష్టం
చర్చల విఫలం అనంతరం ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అమెరికాను ఎద్దేవా చేసింది. “అమెరికా ఉపాధ్యక్షుడు సగం ప్రపంచం దాటి వచ్చి 21 గంటలు చర్చలు జరిపారు. కానీ, యుద్ధంలో గెలవలేని వాటిని అడిగారు. ఇరాన్ దానికి ‘పెద్ద నో’ చెప్పింది. హర్మూజ్ జలసంధి ఇప్పటికీ మూసే ఉంటుంది. జేడీ వాన్స్ వట్టి చేతులతో తిరిగి వెళ్లక తప్పలేదు” అని పేర్కొంది.
మరోవైపు, ఇరాన్ తమ షరతులకు అంగీకరించకపోవడం వల్లే ఒప్పందం కుదరలేదని, ఇది ఇరాన్ కే నష్టమని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

